కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని కోరుతూ వైయస్ఆర్‌సీపీ ఉద్యమబాట పట్టింది. నర్సీపట్నంలో ఉచిత ఇసుక కోసం వైయస్‌ఆర్‌సీపీ నేతలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఫ్రీ ఇసుక అని చెప్పి.. రీచ్‌ల వద్ద టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఉమా శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లను టీడీపీ నేతలు ఖాళీ చేశారన్నారు. ప్రభుత్వం ఉచితమంటూ ప్రకటించారు. కానీ ప్రజల కళ్లుగప్పి దొడ్డిదారిన ఇసుకని టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే ఇసుకను ఉచితంగా అందించాలని ఉమా శంకర్ డిమాండు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.