విశాఖ శారదా పీఠం హైందవ ధర్మ పరిరక్షణతో పాటు ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేస్తోందని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 2023లో హర్యానాలోని కురుక్షేత్రలో లక్ష చండీయాగం చేశామని తెలిపారు. నభూతో నభవిష్యతి అన్న స్థాయిలో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. దేశమంతా సుభిక్షంగా ఉండాలని, ఆధ్యాత్మిక సంగమం జరగాలన్న ఉద్దేశంతో కాశీలో ఒక కార్యక్రమం చేపట్టబోతున్నట్లు చెప్పారు. శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసంలో "కాశీలో కార్తీకం" పేరుతో ఒక కార్యక్రమం చేస్తున్నామన్నారు.
ముక్తి క్షేత్రం వారణాసిలో చేసే పనికి కోటి రెట్ల ఫలం లభిస్తుందన్నారు. నవంబర్ 3 - 5 తేదీల్లో సనాతన కుంజ్ జరుగుతుందని వెల్లడించారు. రామభద్రచార్య సహా అనేక మంది ప్రఖ్యాత స్వామీజీలు, అఖండాల అధిపతులు వస్తున్నారని అన్నారు. యూపీ సీఎం యోగి అదిత్యనాథ్‌ను కలిసి ఆహ్వానించామని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించబోతున్నామని తెలిపారు. నవంబర్ 3న యజ్ఞ సంకల్పంతో కార్యక్రమం మొదలవుతుందన్నారు. నవంబర్ 4న కార్తీక సోమవారం సందర్భంగా రామేశ్వరం నుంచి తెచ్చిన మట్టితో శివలింగం ఏర్పాటు చేసి పూజ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి దక్షిణ భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు.