కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తొలిసారి ఎన్నికల రణరంగంలోకి దూకారు. కేరళలోని వయనాడ్‌కు జరగనున్న ఉప ఎన్నికల బరిలోకి దిగిన ఆమె మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన రాహుల్‌గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నామినేషన్ దాఖలుకు ముందు సోదరుడు రాహుల్‌గాంధీతో కలిసి ప్రియాంక రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానిక పార్టీ నేతలను కలిసేందుకు ప్రియాంక నిన్ననే వయనాడ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ వయనాడ్ ప్రజలకు తన మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. తన సోదరి ప్రియాంకగాంధీని మించిన ప్రతినిధి ఎవరూ ఉండరని కితాబిచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తుందని, పార్లమెంట్‌లో వయనాడ్ నుంచి శక్తిమంతమైన గొంతు అవసరమని పేర్కొన్నారు. ప్రియాంకపై బీజేపీ నాయకురాలు నవ్య హరిదాస్, సీపీఐ సీనియర్ నేత సత్యన్ మోకెరి పోటీ పడుతున్నారు. నవంబర్ 13న ఎన్నికలు జరగనుండగా 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.