ఏపీలో ప్రభుత్వం విజయవాడలో సెప్టెంబర్‌లో వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు పరిహారం అందజేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా మరికొందరు తమకు వరద సాయం అందలేదని చెబుతున్నారు.. ఈ అంశంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. విజయవాడ వరదల్లో నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబానికీ పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు ఇంఛార్జ్ కలెక్టర్ నిధి మీనా. ఎవరికీ ఆందోళన అవసరం లేదని.. అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామన్నారు.
విజయవాడ పరిధిలో సెప్టెంబరు నెలలో అధిక వర్షాలు, బుడమేరు వరద ప్రభావంతో ఇళ్లు, వాహనాలలకు సంబంధించి 1,44,672 మంది వరద బాధితుల అకౌంట్‌లలో పరిహారం కింద రూ.235.72 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. బ్యాంకు అకౌంట్‌లు అనుసంధానం కాని 476 కుటుంబాలకు సంబంధించి అనుసంధానం చేసి, చెల్లింపుల ప్రక్రియ జరిపేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నగర పరిధిలో ఇంకా పరిశీలనలో 2,478 దరఖాస్తులు ఉన్నట్లు చెప్పారు. ఈనెల 24వ తేదీలోగా దరఖాస్తులను పరిష్కరించి.. అర్హులైన వారికి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు నిధి మీనా.
మొత్తం 179 గ్రామ/వార్డు సచివాలయాల్లో వరదకు సంబంధించిన గణన జాబితాలతో పాటు, అదనంగా వచ్చిన దరఖాస్తులను పీజీఆర్‌ఎస్ ఫ్లడ్ మాడ్యూల్‌లో నమోదు చేసినట్లు ఇంఛార్జ్ కలెక్టర్ వివరించారు. ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు అకౌంట్‌లకు నేరుగా పరిహారం జమ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పారదర్శకమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వరద పరిహారం అందిస్తామన్నారు.
మరోవైపు భారీ వర్షాలు, వరదలకు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు మరో ఊరట ఇచ్చింది. మొత్తం పది జిల్లాల్లో రూ.50 వేల వరకు బ్యాంకుల్లో రుణాలు రీ షెడ్యూల్ చేసుకునే వారికి.. అలాగే రూ.50 వేల వరకు కొత్తగా రుణాన్ని పొందే వారికి రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ, యూజర్ ఛార్జీల చెల్లింపుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల వారికి ఈ మినహాయింపు ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 30 తరువాత నుంచి అమల్లోకి తెచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు పరిహారం మాత్రమే కాదు.. అవసరమైన ప్రతి అంశంలో చేయూత అందించింది. వరదల్లో విద్యార్థుల సర్టిఫికేట్లు, విలువైన డాక్యుమెంట్లు కోల్పోయినవారికి ఉచితంగానే అందజేస్తామని తెలిపింది. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సాయం అందిస్తోంది.