ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు ప్రాణహాని ఉందని.. లైసెన్సుడ్ గన్ వాడాలని భావిస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తన ప్రత్యర్థుల నుంచి రక్షణ కోసం ఇకపై లైసెన్సుడ్ గన్ వాడాలని భావిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. ఇటీవల నెల్లూరులోని ఆనం నివాసంలో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం జరిగిందని.. ఆ సమావేశంలో వైఎస్సార్‌సీపీకి చెందిన నేత కనిపించాడని చెప్పుకొచ్చారు. తన చుట్టూ ఏదో జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయన్నారు.
తన నివాసంలో జరిగిన అంతర్గత సమావేశాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ ఒకరు స్వామి మాలలో వచ్చి.. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో, పరిసర ప్రాంతాలపై రెక్కీ చేసినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. వెంటనే తన అనుచరులు గమనించి.. అతడ్ని పట్టుకుని తీసుకొచ్చారన్నారు. వెంటనే అతడ్ని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.. అతడి మాటలు అనుమానంగా ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో తనకు భద్రతను తొలగించిన విషయాన్ని ఆనం గుర్తు చేశారు.
ఇటీవల సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. కొద్ది రోజులకే ముఖ్యమంత్రి చంద్రబాబును నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చానన్నారు. జిల్లాలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోందని.. దాన్ని సహించలేక వైఎస్సార్‌సీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలను బట్టి ప్రజల భద్రతతోపాటు, తన భద్రత గురించీ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ఘటన తర్వాత పోలీసులు మంత్రికి భద్రత కట్టుదిట్టం చేశారు.. అలాగే ఆనం నివాసంలో అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ప్రశ్నించారు. మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.