ఎన్నికల్లో ఘరోపరాజయంతో పరాభవంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మాలనే ప్రయత్నంలో నోటి కొచ్చిందల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలనలో మహిళలపై జరిగినన్ని దాడులు ఇంకెప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో 2 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. వాటిని నిరోధించేందుకు అసలు చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు.
తన ఇంటి పక్కనే దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నిందితుడు వెంకటరెడ్డిని ఐదేళ్ల పాటు అరెస్ట్ చేయకుండా చోద్యం చూసిన జగన్.. శాంతిభద్రతల గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోనే దళిత మహిళ నాగమ్మపై ఆత్యాచారం జరిగితే జగన్ రెడ్డి కనీసం పట్టించుకున్నారా అని మండిపడ్డారు. జగన్ రెడ్డి తన పాలనలో యువతను గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యానికి అలవాటు చేసి వారిని పెడదారి పట్టించారని విమర్శించారు. ఆ ప్రభావంతోనే సైకోలుగా మారిన మగాళ్లు మహిళలపై దాడులు కొనసాగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం నేరాలను ఉక్కుపాదంతో అణిచివేస్తోందని స్పష్టం చేశారు. మహిళలపై దాడులు జరిగిన ఘటనల్లో వెనువెంటనే పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా నిందితులను అరెస్ట్ చేసి శిక్షిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.