ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ ఏనాడైనా పరామర్శలకు వెళ్లారా అంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై మాజీ మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే జరిగిన అత్యాచారంపై కనీసం నోరు మెదపలేదని విమర్శించారు. ‘‘అధికారంలోకి వచ్చాక నీ బాబాయి హత్య గురించి నోరు విప్పలేదు. నేరపూరిత ఆలోచనలతో కూడిన పాలన జగన్ ఐదేళ్లు చేశారు. దళితులు, మైనార్టీలు, బీసీలు హత్యకు గురైనప్పుడు ఎప్పుడైనా జగన్ పరామర్శించారా. పరామర్శల పేరుతో రాజకీయంగా మాపై బురజ జల్లుతున్నారు’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరద బాధితులకు జగన్ ప్రకటించిన రూ.కోటి సాయం ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు.
మరి ఇప్పుడైనా ప్రకటించిన రూ.10 లక్షల సాయం జగన్ ఇస్తారా అంటూ నిలదీశారు. సహనపై దాడి చేసిన నవీన్ తల్లి తమ కుటుంబం వైసీపీలో ఉందని చెప్పిందన్నారు. కానీ జగన్ మాత్రం నిందితుడిని టీడీపీ వ్యక్తి అని అసత్యాలు చెప్పారన్నారు. ఎవరితోనో ఫొటోలు దిగితే తమ పార్టీ వాళ్లు అయిపోతారా అంటూ మండిపడ్డారు. రౌడీయుజాన్ని, అరాచకాలు, మహిళలపై దాడులకు పాల్పడిన వారిని క్షమించమమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి జులుం ప్రదర్శించాలని చూస్తే కుదరదంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజా స్పష్టం చేశారు.