అయిదేళ్లపాటు పడకేసిన పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాది మంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ నెల 29న లాస్‌వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ 'సినర్జీ' పేరుతో నిర్వహించే కీలకమైన వార్షిక సమావేశానికి మంత్రి లోకేశ్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు.ఈ సమావేశానికి ఐటీ సేవల పరిశ్రమ నుండి 3 వేల చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ఐటీలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, కీలక వాటాదారులను ఒకచోట చేర్చడానికి రూపొందించిన ఒక ప్రధాన సదస్సు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్, సెక్రటరీ హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ, షీలా బెయిర్ (FDIC చైర్), జాక్ కాస్ (ఓపెన్ AI) వంటి గౌరవనీయమైన స్పీకర్లను సినర్జీ హోస్ట్ చేస్తుంది.ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా పాలనలో సాంకేతికను జోడించి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేశ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు సినర్జీ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంలో లోకేశ్ చొరవ... ఆర్థికాభివృద్ధిలో ఒక బెంచ్‌మార్క్‌ను ఆవిష్కరించిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాలనలో సాంకేతికత పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై సినర్జీ సమావేశంలో లోకేశ్ ఇచ్చే విలువైన సందేశం ఔత్సాహితులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రికి పంపిన ఆహ్వానపత్రంలో సినర్జీ పేర్కొంది.