ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి అల్లు అర్జున్ మీద నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసులో ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబర్ 6 వరకూ అల్లు అర్జున్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలను నిలుపుదల చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై నవంబర్ 6న తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డిపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. మే 11న పోలీసుల నుంచి అనుమతులు తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే ఎన్నికల సమయం కావటంతో.. నంద్యాలలో అప్పట్లో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి అనుమతి లేకుండానే అల్లు అర్జున్ ర్యాలీ చేశారని ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఎన్నికల సంఘం కూడా అప్పట్లో సీరియస్ అయ్యింది. నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కూడా ఆదేశించింది. మరోవైపు పర్మి్షన్ లేకుండానే అల్లు అర్జున్ శిల్పా రవి ఇంటికి ర్యాలీగా వెళ్లారంటూ అల్లు అర్జున్, శిల్పా రవిపై నంద్యాల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
మరోవైపు ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున వైసీపీ అభ్యర్థిగా ఉన్న శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. దీనిపై జనసేన నుంచి, పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య విబేధాలు అంటూ వార్తలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే శిల్పా రవి తన స్నేహితుడని.. స్నేహితుడికి అండగా నిలబడటం తన బాధ్యత అంటూ అల్లు అర్జున్ చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన తర్వాత.. మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరం మాత్రం పెరిగిందని రాజకీయ, సినీ విశ్లేషకులు చెప్తున్నారు.