మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశంలో ఖాళీగా ఉన్న పలు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇక అన్ని ఉపఎన్నికల్లో కెల్లా దేశం మొత్తం దృష్టి ఇప్పుడు కేరళలోని వయనాడ్ నియోజకవర్గంపై పడింది. ఎందుకంటే రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన వయనాడ్ బరిలో ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నిలవడమే కారణం. ఈ నేపథ్యంలోనే ఇటీవలె వయనాడ్ ఉపఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ.. తాజాగా వయనాడ్ ప్రజలను ఉద్దేశించి.. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు.
ఎన్నికల్లో పోటీ కొత్తే కానీ.. ప్రజల తరఫున పోరాటం తనకు కొత్తేమీ కాదని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. వయనాడ్‌లో కొన్ని నెలల క్రితం జరిగిన ఘోర ప్రకృతి విపత్తు గురించి ప్రస్తావించిన ప్రియాంక గాంధీ.. తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి కొండచరియలు విరిగిపడిన ముండక్కై, చురాల్‌మలకు వెళ్లినట్లు తెలిపారు. ప్రకృతి బీభత్సం కారణంగా వయనాడ్ ప్రజలు ఎదుర్కొన్న నష్టాన్ని, సర్వం కోల్పోయిన వారి ఆవేదనను కళ్లారా చూసినట్లు పేర్కొన్నారు. పిల్లలను కోల్పోయిన తల్లులు.. కుటుంబాన్ని కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను చూసినట్లు వివరించారు.
ఆ చీకటి రోజుల నుంచి బయటపడి కొత్తశక్తితో మీరు ముందుకు కదిలిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రియాంక గాంధీ కొనియాడారు. అలాంటి నిస్సహాయ స్థితిలోనూ పక్కన ఉన్న వారి కోసం వయనాడ్ ప్రజలు పడిన ఆరాటం.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని ప్రశంసలు కురిపించారు. ఆ విపత్తు సమయంలో వయనాడ్ ప్రజలు చూపించిన ధైర్యమే.. ఈరోజు తనలో స్ఫూర్తిని నింపినట్లు చెప్పారు. పార్లమెంటులో వయనాడ్ నియోజకవర్గం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తాను ఒక గౌరవంగా భావిస్తున్నట్లు ప్రియాంక గాంధీ తన ఎమోషనల్ పోస్ట్‌లో వివరించారు.
ఇక రాహుల్ గాంధీకి వయనాడ్ ప్రజలు.. ఎంతో ప్రేమను, అభిమానాన్ని పంచారని.. అదే ప్రేమను తనపై కురిపిస్తారని ఆశిస్తున్నట్లు ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. పార్లమెంటులో వయనాడ్ ప్రజల గళాన్ని వినిపించే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చిన్నారుల భవిష్యత్తు, మహిళల శ్రేయస్సు కోసం తన శక్తికి మించి కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాటిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్త కావొచ్చు కానీ.. ప్రజల తరఫున గళం వినిపించేందుకు చేసే పోరాటం మాత్రం కొత్త కాదని తెలిపారు. ఈ ప్రయాణంలో వయనాడ్ ప్రజలంతా తనకు మార్గదర్శకంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు ప్రియాంకా గాంధీ తెలిపారు.