ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా.. అందుకు నిరసనగా క్షమాపణలు చెప్పేందుకు యుమునా నదిలో మునిగి స్నానం చేయడం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మీదికి వచ్చింది. పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న యమునా నదిని శుద్ధి చేస్తామని.. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలోనే హామీ ఇచ్చిందని.. అయితే అది నెరవేర్చడంలో మాత్రం విఫలం అయిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆప్ సర్కార్ చేసిన తప్పుకు క్షమాపణగా తాను యమునా నదిలో మునుగుతానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే యమునా నదిలో దిగి స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత.. ఆయన అనారోగ్యం పాలు కావడంతో ఆస్పత్రిలో చేరారు.
ఢిల్లీలో కాలుష్యంగా మారిన యమునా నదిలో బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్నానం చేశారు. 2025 నాటికి యమునా నదిని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. నది శుభ్రత కోసం నిధులు కేటాయించి.. వాటిని దుర్వినియోగం చేయడంతోపాటు అవినీతికి పాల్పడిందని వీరేంద్ర సచ్‌దేవా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. యమునా నది పరిస్థితిపై పర్యవేక్షణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు వీరేంద్ర సచ్‌దేవా సవాల్ చేశారు. 2025 ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత యమునా క్లీనింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇందుకు క్షమాపణ కోరడం కోసం నిరసనగా గురువారం ఐటీఓ సమీపంలోని యమునా ఘాట్‌లో నీటమునిగి స్నానం చేశారు. అయితే ఆ తర్వాత ఇంటికి వెళ్లిన వీరేంద్ర సచ్‌దేవాకు.. చర్మంపై తీవ్ర దురద, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. తగిన చికిత్స అందిస్తున్నారు. ఆయన చర్మంపై పొక్కులు వచ్చి ఆస్పత్రిలో చేరినట్టు బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వైద్య పరీక్షల తర్వాత 3 రోజుల పాటు మందులు తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు పేర్కొంది.
అయితే ఇదంతా బీజేపీ చేస్తున్న డ్రామా అని ఢిల్లీ సర్కార్ కొట్టిపారేసింది. ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు.. శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలను యమునా నదిలోకి పంపించి.. నదిని కలుషితం చేస్తున్నాయని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి, ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ తీవ్ర విమర్శలు చేశారు.