జార్ఖండ్ డైనమైట్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో అవతారం ఎత్తనున్నారు. ఇప్పటికే క్రికెటర్‌గా, సైనికుడిగా, సినీరంగంతో పాటు వివిధ రంగాల్లో చేయి వేసిన మిస్టర్ కూల్.. తాజాగా ఇంకో కొత్త అవతారానికి సిద్ధం అయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోనీ వ్యవహరించనున్నట్లు జార్ఖండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవి కుమార్ తాజాగా వెల్లడించారు.
జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ అంగీకరించినట్లు సీఈఓ రవి కుమార్ తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫొటోను ఎన్నికల సంఘం వినియోగించుకునేందుకు ఎంఎస్ ధోనీ అనుమతి ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలపై త్వరలోనే ధోనీతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. జార్ఖండ్ ఓటర్లలో ఓటు హక్కు ఉపయోగించుకోవడంపై చైతన్యం కలిగించేందుకు ధోనీ కృషి చేస్తారని తాము భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమంలో భాగంగా ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారని జార్ఖండ్ ఎన్నికల అధికార వర్గాలు పేర్కొన్నాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబరు 13వ తేదీన తొలి విడత ఎన్నికలు.. నవంబర్ 20వ తేదీన రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక నవంబరు 23వ తేదీన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారంతో నామినేషన్ల దాఖలు గడువు పూర్తి అయింది.