మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అని ఓ గేయ రచయిత రాసిన మాటలు అక్షర సత్యాలు అవుతున్నాయి. అచ్చం అలాంటి పరిస్థితే విజయనగరం జిల్లాలో నెలకొంది.రోడ్డు ప్రమాదం జరిగి చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకుని కాపాడుకునేందుకు ఓ తల్లి గుండెలవిసేలా రోదిస్తూ ఎవరైనా సహాయం చేయండి బాబు, నా కొడుకుని బ్రతికించండి బాబూ అంటూ బ్రతిమాలాడుతున్నా.. ఏ ఒక్క మనసు కనికరించలేదు.. వందలామంది అటుగా వెళ్తూ వస్తూ కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా సహాయం చేయలేదు. అంతే కాదు ఆమె రోదిస్తున్న ఘటనను ఫోటోలు, వీడియోలు తీస్తూ కాలక్షేపం చేస్తూ గడిపారే తప్పా ఏ ఒక్కరూ ఆమెకు చేయూతనివ్వలేదు.. ఎవరి సహాయం లేక ఆసుపత్రికి వెళ్లడం ఆలస్యం కావడంతో కొడుకు ప్రాణాలు కళ్ల ముందే గాల్లో కలిసిపోయాయి. ఈ హృదయవిదారక ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది..విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన గంగాధరరావు, తన తల్లి గోవిందమ్మ తో కలిసి గూడ్స్ షెడ్ ప్రాంతానికి ఆటోలో పని మీద వెళ్తున్నాడు. అలా వెళ్లే క్రమంలో వైఎస్ఆర్ జంక్షన్ వద్ద మార్గమధ్యలో చిన్న పని ఉందని ఆటో నుండి క్రిందకి దిగాడు. ఇంతలో అటుగా వస్తున్న లారీ గంగాధరరావును బలంగా ఢీకొట్టింది. దీంతో గంగాధరరావు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన తల్లి గోవిందమ్మ వెంటనే ఆటో దిగి పరుగు పరుగున కొడుకు వద్దకు చేరుకుంది. రక్తం మడుగులో పడి ఉన్న కొడుకును చూసి రోదిస్తూ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కొడుకు పరిస్థితి చూసిన తల్లి గుండెలవిసేలా రోధిస్తూ.. ''అయ్యా ఎవరో ఒకరు సహాయం చేయండి, నా కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాలి, ఎవరైనా సహాయం చేస్తే బ్రతుకుతాడు అంటూ'' ధీనంగా అందరినీ అర్ధించింది. ఓవైపు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న కొడుకును కాపాడుకోవాలని తపన, మరోవైపు ఎవరైనా సహాయం చేయండి అని ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది..
ప్రమాదం జరిగిన వైఎస్ ఆర్ జంక్షన్ రద్దీగా ఉండే ప్రాంతం.. నిత్యం వందల మంది అటుగానే రాకపోకలు చేస్తుంటారు. అలా వందల మంది ఘటనా స్థలం ప్రక్క నుండే రాకపోకలు చేస్తున్నా.. గోవిందమ్మ ఆర్తనాదాలు ఎవరికి పట్టలేదు. అంతేకాకుండా మరికొందరు రక్తపు మడుగులో ఉన్న కొడుకు ప్రక్కన రోదిస్తున్న గోవిందమ్మ ఫోటోలు, వీడియోలు తీస్తూ కాలక్షేపం చేశారు కానీ సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. వారిని చూస్తున్న తల్లి గోవిందమ్మ పదే పదే సహాయం చేయండయ్యా.. నా కొడుకుని బతికించండి అంటూ రోదిస్తూనే ఉంది. అయినా ఒక్కరంటే ఒకరు కూడా మానవత్వం చూపించలేదు. అలా సుమారు అరగంటకు పైగా సమయం కావడంతో గంగాధరరావు రక్తం చాలా పోయింది.మధ్యాహ్నం 12:45 కి ప్రమాదం జరగితే గోవిందమ్మ అనేక అవస్ధలు పడి అరగంట తరువాత 1:15 నిమిషాలకు చివరికి 108 సహాయంతో ఆసుపత్రికి తరలించింది. అప్పటికే గంగాధరరావు ప్రాణాలు వదిలాడు. ప్రమాదం జరిగిన తరువాత ఆలస్యం కావడం వల్ల గంగాధరరావు చనిపోయాడని వైద్యులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన ఘటన నుండి కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ప్రభుత్వ ఆసుపత్రి, కార్పొరేట్ వైద్యశాలలు ఉన్నాయి. ఘటన జరగగానే ఎవరైనా సహాయం చేసి ఆసుపత్రికి తరలించి ఉంటే గంగాధరరావు ప్రాణాలు కాపాడగలిగేవారు. ప్రస్తుతం కుమారుడి మృతి పై గోవిందమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.