ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళి నుంచి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనుంది. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులనే దానిపై వివరాలను సైతం పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల వెల్లడించారు. అక్టోబర్ 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభిస్తామన్న మంత్రి.. అక్టోబర్ 29 నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ మొదలవుతుందని చెప్పారు. ఇక ఈ పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ కోసం మొదట వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సిలిండర్ డెలివరీ చేసిన రెండురోజుల్లోగా ఆ నగదును రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తుంది.
ఇక ఈ పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందవచ్చు. ఎప్పుడెప్పుడనే వివరాలను సైతం ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ 31 నుంచి మార్చి నెలాఖరులోగా ఒక సిలిండర్.. అలాగే 2025 ఏప్రిల్ 1 నుంచి జులై వరకూ రెండో సిలిండర్.. జులై నుంచి నవంబర్ వరకూ మూడో సిలిండర్ ఉచితంగా అందించనున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే అక్టోబర్ 29 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్ ప్రారంభం కానుండగా.. ఓ సమస్య అధికారులను ఇబ్బంది పెడుతోంది.
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులుగా తెల్ల రేషన్‌కార్డుదారులను నిర్ణయించారు. పథకానికి తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డు ప్రామాణికంగా నిర్ణయించారు. తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డు ప్రాతిపదికగా తీసుకొని సిలిండర్ బుక్ చేసుకున్న వారికి సబ్సిడీ సొమ్మును బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నప్పటికీ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా బుకింగ్ జరుగుతోంది.
అయితే గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారుల ఆధార్, ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్లు నంబర్లు ఉంటున్నాయి. అయితే ఏజెన్సీల వద్ద తెల్ల రేషన్‌కార్డుల సమాచారం అందుబాటులో ఉంటే గానీ ఉచిత గ్యాస్ సిలింజర్ బుకింగ్ సాధ్యపడదు. సబ్సిడీ రావాలంటే రేషన్ కార్డు వివరాలను పొందపర్చాల్సి ఉంటుంది. ఇదెలా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అక్టోబర్ 28 నాటికి పూర్తి విధి విధానాలు వస్తాయని.. వాటిని వెల్లడిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు.