తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇటీవల శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రతిపాదించింది. శంషాబాద్ - విశాఖపట్నం (దువ్వాడ), కర్నూలు- విశాఖపట్నం (దువ్వాడ) మార్గాల్లో సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ దాదాపుగా ఖరారైంది. అయితే రైల్వే శాఖ ఏర్పాటు చేస్తున్న ఈ కారిడార్ కారణంగా దువ్వాడ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. దువ్వాడ రైల్వే స్టేషన్‌కు మహర్దశ పడుతుందని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారిడార్‌లో దువ్వాడ రైల్వే స్టేషన్ కీలకం కానుంది. మరోవైపు ఇప్పటికే విశాఖపట్నానికి వచ్చే అనేక ప్రత్యేక రైళ్లు వైజాగ్ లోపలికి రాకుండా దువ్వాడ మీదుగా వెళ్తున్నాయి. ఈ రకంగా విశాఖకు ప్రత్యామ్నాయంగా దువ్వాడ మారిందంటున్నారు రైల్వే శాఖ అధికారులు.
దువ్వాడ రైల్వే స్టేషన్ మీదుగా మొత్తం 52 రైలు సర్వీసులు నడుస్తున్నాయి. ఇక విశాఖపట్నానికి రాకుండా 16 రైళ్లు దువ్వాడ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. దువ్వాడ మీదుగా 8 ప్రత్యేక రైళ్లు ప్రయాణం సాగిస్తున్నాయి. సుమారు 20 వేల మంది ప్రయాణికులు నిత్యం దువ్వాడ నుంచి రాకపోకలు సాగిస్తుంటారని అంచనా. విశాఖ నుంచి లక్ష మంది ప్రయాణికులు రైలు ప్రయాణాలు చేస్తుంటే.. దువ్వాడ నుంచి రోజూ 20 వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు.
అయితే అభివృద్ధి విషయంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌తో పోలిస్తే దువ్వాడ రైల్వే స్టేషన్‌కు అనేక సానుకూలతలు కనిపిస్తున్నాయి. మరింత అభివృద్ధి చేసేందుకు విశాఖ రైల్వే స్టేషన్ వద్ద స్థలం లేదు, కానీ దువ్వాడ స్టేషన్ విస్తరణకు కావాల్సిన భూమి అందుబాటులో ఉంది. ఇప్పటికే అమృత్‌భారత్ పథకం కింద దువ్వాడ స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు సెమీ హైస్పీల్ రైల్ కారిడార్‌లో కీలకం కావటంతో మరిన్ని అధునాతన సౌకర్యాలు రానున్నాయి.
మరోవైపు విమాన ప్రయాణికులు త్వరగా ఇళ్లకు చేరుకునేందుకు ఈ సెమీ హైస్పీల్ రైల్ కారిడార్ ప్రతిపాదించారు. శంషాబాద్ నుంచి దువ్వాడ వరకూ హైస్పీల్ రైల్ కారిడార్ ప్రతిపాదించారు. అయితే విశాఖపట్నంలోకి నూతన కారిడార్ మార్గం నిర్మించాలంటే సంక్లిష్టమని అధికారులు భావిస్తున్నారు. భారీ వంతెనలు నిర్మించాల్సి వస్తుందని.. అందుకే దువ్వాడ స్టేషన్ వరకూ పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి వస్తే శంషాబాద్ నుంచి విశాఖపట్నానికి నాలుగు గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లాలన్నా కూడా ఎనిమిదిన్నర గంటలు పడుతోంది.