సాధారణంగా రైళ్లు నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి. మరికొన్ని రైళ్లు రెండు రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి నడిచే రైళ్లు కూడా ఉంటాయి. కానీ ఈ రైలు మాత్రం వాటికంటే ప్రత్యేకమైంది. ఎందుకంటే ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే ఈ ట్రిప్‌కు వెళ్లేవారు ఎక్కడికో గమ్యస్థానానికి వెళ్లకుండా.. వివిధ ప్రాంతాలకు తిరిగి వస్తారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ఈ టూర్‌ను ప్రతీ సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి ఈ టూర్ టికెట్ బుకింగ్‌లు పూర్తి కాగా వచ్చే నెల 16వ తేదీన ఈ రైలు ప్రారంభం కానుంది.
ఉత్సాహవంతులైన బిజినెస్‌మెన్‌ల కోసం ప్రత్యేకంగా ప్రతీ ఏడాది ఒక జాగృతి రైలు నడుస్తూ ఉంటుంది. 15 రోజుల పాటు సాగే జాగృతి యాత్ర ఈసారి నవంబర్ 16వ తేదీన మొదలు కానుంది. ఈ జాగృతి రైలు ఏటా 500 మందిని తీసుకెళ్తుంది. మహారాష్ట్ర ముంబైకి చెందిన జాగృతి సేవాసంస్థాన్ అనే ఎన్జీవో ఈ జాగృతి రైలును నడిపిస్తుంది. 2008 నుంచి ప్రతీ సంవత్సరం ఈ జాగృతి యాత్ర సాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలోని 23 దేశాల నుంచి 75 వేల మందికి పైగా యువత ఈ జాగృతి యాత్రలో పాల్గొన్నారు.
ఈ 15 రోజుల టూర్‌లో యువ పారిశ్రామికవేత్తలు ఒకరినొకరు మాట్లాడుకుని.. తమ నెట్‌వర్క్‌ను పెంచుకుంటారు. మరికొందరు వారికి మార్గనిర్దేశం చేస్తారు. దేశానికి యంగ్ బిజినెస్‌మెన్‌లను అందించడం ఈ ప్రయాణం ప్రధాన ఉద్దేశం. ఈ 15 రోజుల ప్రయాణంలో సుమారు 100 మంది సీనియర్లు.. యంగ్ బిజినెస్‌మెన్‌లకు వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, తయారీ, నీరు, పారిశుద్ధ్యం, సాహిత్యం, సంస్కృతి వంటి అంశాల్లో మెంటార్లుగా వ్యవహరిస్తారు. దేశంలోని టైర్-2, టైర్- 3 నగరాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలు, సవాళ్ల గురించి చర్చిస్తారు.
దేశంలోని 15 నగరాలను చుట్టొస్తూ ఈ యాత్ర 15 రోజుల్లో మొత్తం 8 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణించేందుకు కేవలం ప్రతీ ఏటా 500 మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. ఈ ఏడాది నవంబర్ 16వ తేదీన ముంబై నుంచి ప్రారంభం కానున్న ఈ జాగృతి యాత్ర.. డిసెంబర్ 1వ తేదీతో ముగుస్తుంది. ఢిల్లీ, దేవరియా (ఉత్తర్‌ప్రదేశ్), రాజ్‌గిర్ (బీహార్), బ్రహ్మపుర (ఒడిశా), విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), చెన్నై.. మధురై(తమిళనాడు), బెంగళూరు.. హుబ్బళ్లి(కర్ణాటక), ముంబై(మహారాష్ట్ర), అహ్మదాబాద్(గుజరాత్), తిలోనియా(రాజస్థాన్).. మొత్తం 15 నగరాల గుండా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో 8-12 మంది ఇన్‌స్పిరేషనల్ వ్యక్తులు కూడా పాల్గొంటారు. ఈ ట్రిప్ పూర్తయ్యేలోపు 4 మెగా ఈవెంట్లను నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్స్, మీటింగ్స్, ప్రెజెంటేషన్లు ఇవ్వడం.. ఇలా పలు విషయాలను ఈ ప్రయాణంలో నేర్చుకుంటారు.
ఇక జాగృతి సేవాసంస్థాన్ ఎలాంటి లాభాలు ఆశించకుండా ఈ యాత్రను నిర్వహిస్తుంటుంది. ఈ యాత్రలో పాల్గొనాలంటే జాగృతి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 2024 ఏడాదికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తి కాగా.. ఇక ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ట్రిప్‌లో పాల్గొనాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.