మార్కెట్ విలువ పరంగా భారత్‌లో టాటా గ్రూప్ అతిపెద్దది. దీని మార్కెట్ విలువ రూ. 30 లక్షల కోట్లకుపైగానే ఉంటుంది. పలు దేశాల జీడీపీ కంటే కూడా దీని విలువే ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో టాటా సన్స్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా పాత్ర కీలకం. దశాబ్దాల పాటు సంస్థకు నేతృత్వం వహించి సంస్థను విస్తరించారు. ఆయన నేతృత్వంలో దాదాపు అన్ని రంగాల్లో కార్యకలాపాలు ప్రారంభించి.. ఎందరికో ఉపాధి కల్పించింది టాటా గ్రూప్. రతన్ టాటా.. అక్టోబర్ 9న వయో సంబంధిత సమస్యలతో ప్రాణాలు విడిచారు. దీంతో.. టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటాను నియమించగా.. ఇప్పుడు రతన్ టాటా ఆస్తుల గురించే అంతా చర్చించుకుంటున్నారు.
నిజానికి రతన్ టాటా.. తన సంపదలో పెద్ద మొత్తంలో విరాళాలకే కేటాయించారు. సగానికిపైగా దాతృత్వ కార్యక్రమాలకే వెచ్చించారు. ఇంకా ట్రస్టులకు రాసిచ్చారు. మరి టాటా ఆస్తి ఎవరికి చెందుతుంది..? ఆయనకు ఎంత సంపద ఉంది.. వీలునామా రాశారా.. దాని బాధ్యత ఎవరిది.. ఇలా టాటా ఆస్తి గురించే జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. టాటా సంపద గురించి, ఆయన వీలునామా గురించి పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. రతన్ టాటా సంపద రూ. 10 వేల కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోనే 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అలీబాగ్‌లో బీచ్ బంగ్లా ఉంది. ముంబై జుహూ తారా రోడ్ దగ్గర రెండంతస్తుల భవనం ఉంది. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ. 350 కోట్లకుపైనే ఉంది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్‌లో 0.83 శాతం వాటా రతన్ టాటాకు ఉంది. తన సంపదలో చాలా వరకు రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్‌కు బదిలీ చేయించినట్లు సమాచారం.
టాటాకు శునకాలు అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి సంరక్షణ కోసం ఆయన బతికున్నప్పుడు ఎన్నో చర్యలు తీసుకున్నారు. అయితే చనిపోయిన తర్వాత కూడా వాటి సంరక్షణ కోసం రతన్ టాటా బాధ్యతలు తీసుకోవడం విశేషం. ఆయన పెంపుడు శునకం జర్మన్ షెఫర్డ్ టిటోకు 'అన్‌లిమిటెడ్ కేర్" (అపరిమిత సంరక్షణ) పేరిట తన వీలునామాలో ప్రత్యేక నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ శునకం బాధ్యతను చాన్నాళ్లుగా రతన్ టాటా దగ్గర కుక్‌గా పనిచేస్తున్న రాజన్ షా చూసుకోనున్నట్లు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
టిటోతో పాటుగానే రతన్ టాటాతో దాదాపు 30 ఏళ్లకుపైగా అనుబంధం ఉన్న.. తన బట్లర్ సుబ్బయ్య, కుక్ రాజన్ షా లకు కూడా తన ఆస్తిలో కొంత భాగం రతన్ టాటా వెచ్చించారట. ఇదే సమయంలో చాలా కాలంగా రతన్ టాటాతో చాలా దగ్గరి అనుబంధం ఉన్న శాంతను నాయుడుకు కూడా కొంత మొత్తం దక్కుతుందని తెలుస్తోంది. తన సంపదలో కొంత మొత్తం.. తన ఫౌండేషన్, సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరులు షిరీన్, డీనా జెజీబోయ్ సహా గృహ సిబ్బందికి వాటాలు కట్టబెట్టినట్లు వీలునామాలో పొందుపరిచినట్లు సమాచారం.