ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం త్వరలోనే మరోసారి భేటీ కానుంది. నవంబర్ ఆరో తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది.ఈ భేటీలో పలు అంశాలపై ఏపీ మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. నవంబర్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారని సమాచారం. ఏయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే దానిపై తేదీలను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఈ క్రమంలో పూర్తి స్థాయి బడ్జెట్‌పైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయి బడ్జెట్ గురించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తులు కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో పాటుగా ఆర్థిక శాఖ అధికారులతోనూ పయ్యావుల కేశవ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరిల ఓటాన్ అకౌంట్ బడ్జె్ట్ ప్రవేశపెట్టింది. ఇక ఎన్నికలు పూర్తై అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కారు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పొడిగించింది.
చంద్రబాబును ఇంప్రెస్ చేయడానికే పసుపు చీర.. షర్మిలపై విజయసాయిరెడ్డి విమర్శలు
నూతన ప్రభుత్వం అప్పుడే కొలువుదీరటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద సమగ్రమైన అవగాహన లేని నేపథ్యంలో తాత్కాళికంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే దీనిపై వైసీపీ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీల అమలుకు నిధులు కేటాయించాల్సి వస్తుందనే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది. హామీల అమలుపై చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఏ పథకానికి ఎన్ని నిధులు అనే విషయాన్ని చెప్పాల్సి వస్తుందనే పూర్తిస్తాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదనే విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ రెండోవారంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఏపీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.