తెలంగాణ నుంచి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి కాటాను ఏపీ టూరిజం ఎండీగా నియమించింది. ఆలాగే ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ నియమితులయ్యారు. జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్ నియమితులయ్యారు.మరోవైపు పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌గా ఉన్న జి.వాణిమోహన్‌ను బదిలీ చేశారు. జీఏడీలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇక ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ పోల భాస్కర్‌ను రిలీవ్ చేశారు. అయితే తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
మరోవైపు ఐఏఎస్ ఆధికారుల బదిలీల వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లాలంటూ అక్టోబర్ 9న డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 16లోగా సొంత రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఐఏఎస్ ఆధికారులను ఆదేశించింది. అయితే డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. తాము ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా ఆదేశించాలంటూ క్యాట్‌లో పిటిషన్ వేశారు. అయితే క్యాట్‌లో వారికి ఊరట లభించలేదు. డీవోపీటీ ఆదేశాలను పాటించాలని క్యాట్ తీర్పు ఇచ్చింది. దీంతో క్యాట్ తీర్పుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
అయితే ఐఏఎస్ అధికారుల లంచ్ మోషన్ పిటిషన్ విచారించిన తెలంగాణ హైకోర్టు.. క్యాట్ తీర్పుతో ఏకీభవించింది. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. క్యాట్ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు, ఇందులో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. వారి పిటిషన్ కొట్టివేసింది.
దీంతో ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, వాణీప్రసాద్, వాకాటి కరుణలను తెలంగాఇ ప్రభుత్వం రిలీవ్ చేసింది. అనంతరం వీరంతా ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. ఏపీలోని తెలంగాణ ఐఏఎస్‌లు సృజన, హరికిరణ్, శివశంకర్‌లు కూడా తెలంగాణలో రిపోర్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి వీరి పోస్టింగ్‌లపై ఆసక్తి ఏర్పడగా.. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్‌లకు పోస్టింగ్ ఇచ్చింది.