ఇంటి ఆడపడుచుతో కన్నీరు పెట్టిస్తే ఇంటికి అరిష్టమని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ సీఎం జగన్‌నుద్దేశించి అన్నారు. ఆయన సోమవారం హైదరాబాద్, మాదాపూర్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఆస్తుల వివాదం నాలుగేళ్ల నుంచి జరుగుతోందని.. రాజశేఖర్‌రెడ్డి బతికున్నప్పుడు సంపాదించిన ఆస్తులనే షర్మిల అడుగుతోందని చెప్పారు. వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తులు (వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి) ఈ విషయంలో బహిరంగంగా మాట్లాడడం బాధ కలిగిస్తోందన్నారు.
ఈ సమస్యను పరిష్కరించగలిగింది విజయలక్ష్మి మాత్రమేనని.. ఆమె త్వరితగతిన పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ తమ కుటుంబాన్ని చీలుస్తున్నారని జగన్ మాట్లాడడం మంచి పద్థతి కాదన్నారు. రాజశేఖర్‌రెడ్డిని చంపిన కుట్రలో చంద్రబాబు పాత్ర ఉందనడం సిగ్గుచేటని స్పష్టం చేశారు. ఆయన మరణంలో కుట్ర ఉంటే గత ఐదేళ్లలో ఎందుకు విచారణ చేయించలేదని నిలదీశారు.