తరగతుల విలీనంపై వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో 117ను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రక్రియ ప్రారంభించింది. మూడు నెలల్లో ఆ జీవో రద్దుచేసి, అనంతరం కొత్త జీవోలు జారీ చేయనుంది. మొత్తంగా విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇటీవల జీవో 117 రద్దుపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి జీవో 117ను రద్దుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. విలీనం తరగతులను వెనక్కి తీసుకొస్తే ఏర్పడే సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. మొత్తంగా 3,4,5 తరగతుల విలీనం రద్దుకు అడుగులు పడుతున్నాయి. జీవో 117 రద్దుతో ప్రాథమిక పాఠశాలలకు పూర్వ వైభవం రానుంది. జిల్లాలో 129 పాఠశాలలకు చెందిన 3,4,5 తరగతులు వెనక్కి రానున్నాయి. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగనుంది. జీవో 53 ప్రకారం ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరగనుంది. ప్రాథమికోన్నత పాఠశాలలకు రోల్ బట్టి సబ్జెక్ట్‌ల వారీగా ఉపాధ్యాయులు రానున్నారు.