పైడిమాంబ సిరిమానోత్సవంలో చివరి ఘట్టం ఉయ్యాలకంబాల ఉత్సవం మంగళవారం జరగనుంది. దేవస్థానం అధికారులు, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉయ్యాల కంబాల రోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో సిరిమానోత్సవానికి ఏర్పాటు చేసిన క్యూలైన్లు, షామియానాలను దేవస్థానం అధికారులు అలానే ఉంచారు. దీంతో భక్తులకు ఎండ నుంచి రక్షణ లభించనుంది. మంగళవారం ఉదయం 4.45 గంటలకు సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం అనంతరం పైడిమాంబ దర్శనానికి ఉదయం 6 గంటలకు భక్తులను అనుమతిస్తారు.
నగరంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది పైడిమాంబ భక్తులు రానున్నారు.. సిరిమానోత్సవం సమయంలో వీలుకాని వారు, వేర్వేరు ప్రాంతాల్లో ఉండిపోయిన వారంతా పైడిమాంబ దర్శనానికి వచ్చి మొక్కుబడులు తీర్చుకోనున్నారు.ఏటా ఆరు నెలలు వనంగుడిలోనూ, మరో ఆరు నెలలు చదురుగుడిలో ఉండి పైడిమాంబ భక్తులకు దర్శనమివ్వనున్నారని భక్తుల నమ్మకం. ఆ ప్రకారం వైశాఖ మాసంలో పైడిమాంబను వనంగుడి నుంచి చదురుగుడికి తీసుకొచ్చారు. సిరిమానోత్సవం, అనంతరం ఉయ్యాల కంబాల వరకూ ఇక్కడే ఉంటారు. మంగళవారం నాటి ఉయ్యాల కంబాల తర్వాత చదురుగుడి నుంచి పైడిమాంబను వనంగుడికి తీసుకువెళ్తారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది, అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు.