ప్రజలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా అందించడానికి ప్రభుత్వంపై రూ. 2,684.75 కోట్ల రాయితీ భారం పడుతుందని పౌరసరఫరాలశాఖ అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది. ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోనే రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
తొలివిడత వంట గ్యాస్ సిలిండర్లను పొందే లబ్ధిదారులకు చెల్లించాల్సిన రాయితీ మొత్తం రూ.895 కోట్ల విడుదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ అంగీకారంతో ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ రాయితీ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు వీలుగా హెచ్‌పీ, భారత్, ఇండేన్ గ్యాస్ కంపెనీల అకౌంట్లకు ముందుగానే మళ్లిస్తారు. ఈనెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే లబ్ధిదారులు నేటి (మంగళవారం) నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.