సింహాద్రి అప్పన్న స్వామిని మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం, బేడ మండపం ప్రదక్షిణ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని మంత్రికి ఆలయ అధికారులు అందజేశారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ... సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేష్ మంచి పరిపాలన అందిస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్‌ను మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరం పాటు సమయం తీసుకుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్‌ను నాలుగువేలు ఇస్తున్నామన్నారు. ప్రతి నెల ఒకటో తారీఖున లబ్ధిదారులు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని.. ఒకటో తేదీ ఆదివారం పడితే 31వ తారీఖున పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు దీపావళి కానుకగా ఇవాల్టి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు బుకింగ్ మొదలుకానుందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులనుఉపయోగించుకుంటూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధికి పరచడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని మంత్రి కొల్లురవీంద్ర పేర్కొన్నారు.