కృష్ణా జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. ప్రియురాలి ఇంటికి వెళ్లి అక్కడ ఉరి వేసుకున్నాడు. ఉయ్యూరుకు చెందిన చందా మాధవ రాజు, కోరపాటు మాధవి ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరికీ విభేదాలు రావడంతో 2021లో విడిపోయారు.. గత రాత్రి రాజు మాధవి ఇంటికి వెళ్లాడు. తనకు మాధవికి పెళ్లి చేయమని అడిగాడు.. దీనికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో అర్ధరాత్రి సమయంలో మాధవి ఇంటి వరండాలో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. మాధవరాజు మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విజయవాడ సమీపంలోని కానూరులో యువకుడు ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. గంట నాగవెంకట సత్యనారాయణది ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం. గతంలో గంగూరు ధనేకుల ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతూ మధ్యలో ఆపేశాడు.. అతడికి తల్లిదండ్రులు కూడా లేరు. సత్యనారాయణ కానూరు మురళీనగర్‌లో హాస్టల్ రూమ్‌లో ఉంటున్నాడు. అయితే స్నేహితుడు పల్లపాటి మనోజ్విశాల్తో కలిసి మూడు నెలల క్రితం విజయవాడలో ఏఐ స్టార్ట్అప్ కంపెనీ ప్రారంభించారు.
సత్యనారాయణ శుక్రవారం ఉదయం తన రూమ్‌లో సీలింగ్‌ఫ్యాన్‌కు దుప్పటితో ఉరేసుకున్నాడు. మధ్యాహ్నం మిత్రుడు మనోజ్విశాల్ రూమ్‌కు వచ్చి తలుపు కొట్టగా తీయలేదు.. అనుమానంతో తలుపు పగులకొట్టి చూడగా సత్యనారాయణ ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గన్నవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భార్యను తీసుకువచ్చేందుకు వెళ్తూ భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. గన్నవరం మండలం వీరపనేనిగూడెంకి చెందిన కోడూరు సింహాద్రిప్రసాద్ కేబుల్ ఆపరేటర్. పామర్రు మండల పరిధిలోని ఓ కోచింగ్ సెంటరులో ఉన్న భార్య చంద్రకళను ఇంటికి తీసుకొచ్చేందుకు బయల్దేరారు. విజయవాడ - మచిలీపట్నం నేషనల్ హైవేపై కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో కురుమద్దాలి ఫ్లైఓవర్ దగ్గరకు రాగానే కారు టైరు పేలి అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో సింహాద్రి ప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు.