ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (సోమవారం) వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్తారు.సీఆర్డీఏ అథారిటీకి చైర్మన్ హోదాలో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 29వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక విషయాలపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు. ఈ సమీక్షకు మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. గతంలో అమరావతి నిర్మాణానికి టెండర్లు పొందిన సంస్థల ఒప్పందాల రద్దుపై నిర్ణయం తీసుకోనున్నారు. తాజాగా మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
గతంలో ఇచ్చిన రేటుకు నిర్మాణాలు చేపట్టలేమని గుత్తేదారులు చెబుతున్నారు. దీంతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు మార్గం సుగమం చేయడంలో భాగంగా ఈరోజు సీఆర్డీఏ అథారిటీ కీలక సమావేశం జరగనుంది. అనంతరం నూతన స్పోర్ట్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఏపీలో క్రీడలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడతారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమీక్షలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే సాయంత్రం వ్యవసాయ, పశుసంవర్ధక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.