శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేపిన అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. జిల్లాలోని చిలమత్తూరు మండలంలో అత్తాకోడలిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే గ్యాంగ్ రేప్ ఘటనలో అరెస్టు అయిన నేరస్తులతో కొందరు పోలీసులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. పలు కేసుల నుంచి గ్యాంగ్ రేప్ నేరస్తులను హిందూపురం పోలీసులు తప్పించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఉన్నతాధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేరస్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుళ్లు వెంకట్రామి రెడ్డి, నరేష్‌లను సస్పెండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. ఓ ఏఎస్ఐతో పాటు మరికొందరు కానిస్టేబుళ్లపై అధికారులు వేటుకు రంగం సిద్ధం చేశారు.