శ్రీ సత్యసాయి జిల్లాలోనే అత్యధికంగా ఫ్రీ హోల్డ్ అమల్లో 50 శాతానికి పైగా అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. ఇవాళ(సోమవారం) శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో మంత్రి అనగాని పర్యటించారు. మంత్రి అనగానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రెవెన్యూ లోటు భర్తీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 20 వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలిపారు. నిధులు విడదలవ్వగానే రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో మూడు రాజధానులు పేరుతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మూడుముక్కలాట ఆడారని విమర్శలు చేశారు. రాష్ట్రసమగ్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమిని కలుపుకుని ముందుకు వెళ్తామని అన్నారు. అనంతపురం, శ్రీసత్య సాయి జిల్లాను ఇండస్ట్రీయల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మాటిచ్చారు. ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారుల మధ్య సమన్వయంతో అభివృద్ధి చేస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.