కర్నూల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రులు, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు ఇవాళ(సోమవారం) సందర్శించారు. ఉల్లి రైతులతో మాట్లాడి గిట్టుబాటు ధర సమస్యల గురించి మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... ఉల్లి రైతుకు ఒక్క రూపాయు కూడా నష్టం జరగకూడదని, వినియోగ దారుడుకి భారం కాకుండా మేలు జరిగేలా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. ఈనామ్ పని చేయకపోతే వెంటనే ఆఫ్‌లైన్‌లో నమోదు చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో 52 వేల టన్నుల ఉల్లి వస్తే దానికి నాలుగు రేట్లు అధికంగా 2.5 లక్షల టన్నుల ఉల్లి అధికంగా వచ్చిందని తెలిపారు.
గతంలో కంటే 4 రేట్లు దిగుబడి అధికంగా వచ్చినా, వైసీపీ పాలనలో ధరలకంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కువ ధర రైతులు పొందారని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో హార్టికల్చర్ , డ్రిప్ ఇరిగేషన్ వంటివి అన్నింటినీ గాలికొదిలేశారని మండిపడ్డారు. రాయలసీమ బిడ్డ అని చెబుతూనే ఇరిగేషన్‌ను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. దళారులు సిండికేట్ అవ్వకుండా కోడుమూరులో కూడా ఉల్లిమార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.