గతేడాది హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు అత్యంత సన్నిహితుడైన అర్ష్ దల్లాను కెనడా పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 27-28 తేదీలలో కెనడాలో జరిగిన ఓ కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు భారత భద్రతా సంస్థలకు సమాచారం అందినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ సమాచారాన్ని భారత భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఇక అర్ష్ దల్లాను అరెస్ట్ చేసిన తర్వాత వదిలి పెట్టారా లేక ఇంకా జైలులోనే ఉన్నాడా అనేది కూడా తెలియరాలేదు.అర్ష్ దల్లా పంజాబ్‌లోని మోగా పట్టణానికి చెందినవాడు. తన భార్యతో కలిసి ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నాడని భారత భద్రతా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. జనవరి 2023లో దల్లాను ఉగ్రవాదిగా గుర్తిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో దల్లా అరెస్ట్ పరిణామం చోటుచేసుకుంది. కాగా దౌత్య సంబంధాలు దెబ్బతినడానికి ఖలిస్థానీ టైగర్స్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ నిజ్జర్ హత్య కారణమన్న విషయం తెలిసిందే.