ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల పేరును ‘డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ వైద్య కళాశాల’గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎల్లాప్రగడ గౌరవార్థం కళాశాలకు ఆయన పేరును ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు సైతం ఈ ప్రతిపాదనకు అంగీకరించటం ఆనందదాయకమని మంత్రి అన్నారు.
మానవాళి సంక్షేమం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరమని ఆయన అన్నారు. ఇటీవల మచిలీపట్నం వైద్య కళాశాలకు సైతం స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెట్టిన విషయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ గుర్తు చేశారు.