భోగాపురంలో నిర్మిస్తున్న ఎయిర్ పోర్టుతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ ఉమ్మడి జిల్లాల ప్రజలకు ప్రయోజనం ఉంటుందని, 2026 జూన్ నాటికి ఎయిర్‌పోర్టు పూర్తి అయ్యేలా చూస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు. టెర్మినల్ భవనం, ఇతరత్రా పనులను పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకొ న్నారు. జీఎంఆర్, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విమానాశ్రయ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.
రెండు నెలల క్రితం 40శాతం పనులు జరిగితే ప్రస్తుతం 50శాతం పనులు పూర్తి అయినట్లు తెలుస్తోందన్నారు. ఎర్త్ వర్కు 99శాతం, రన్‌వే 65శాతం, టెర్మినల్ 38.59 శాతం, ఎసీటీ 43.94 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. పనుల తీరును బట్టి చూస్తే 2026 జూన్ నాటికి ఎయిర్‌పోర్టు పూర్తి అయ్యేలా ఉందన్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే ఈ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. కేంద్రమంత్రి వెంట ప్రాజెక్టు హెడ్ రామరాజు ఉన్నారు.