అచ్యుతాపురం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తూ వేడి సాంబరులో పడిపోయింది. విద్యార్థిని తల్లిదండ్రుల ద్వారా ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే.... అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం కె.సంతపాలెం గ్రామానికి చెందిన రొంగలి యశశ్వని అచ్యుతాపురంలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నది. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో హాస్టల్‌లోని వంటశాలకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ అక్కడ వేడి సాంబరు వున్న పెద్ద గిన్నెలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది.. ఆ బాలికను బయటకు తీశారు. సాంబరు వేడిగా వుండడంతో 50 శాతం శరీరం కాలిపోయింది.
దీంతో గురుకుల పాఠశాల సిబ్బంది వెంటనే విశాఖ తీసుకెళ్లి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స చేయించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్, సిబ్బంది బయటకు పొక్కనివ్వలేదు. కానీ బాలికకు చికిత్స చేస్తున్న ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం వచ్చింది. అయినప్పటికీ పోలీసులు సైతం కేసు నమోదు చేయలేదు.. మీడియాకు వివరాలు వెల్లడించలేదు. వ్యవసాయ కూలీ అయిన బాలిక తండ్రి శ్రీరామమూర్తి మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు సుమారు లక్ష రూపాయలు ఖర్చు అయినట్టు ఆయన చెబుతున్నారు. పాఠశాల సిబ్బంది, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే తన కుమార్తెకు ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఆదివారం ఇక్కడకు వచ్చిన బాలిక తల్లిదండ్రులు.. గురుకుల పాఠశాల సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతులు జరిగే సమయంలో తమ కుమార్తె వంటశాలలోకి ఎందుకు వెళ్లిందో ప్రిన్సిపాల్, సిబ్బంది వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్, సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి, చర్యలు చేపట్టాలని కోరారు.