విశాఖ నగరంలో దోమల నియంత్రణకు డ్రోన్ల వినియోగానికి జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. చెరువులు, కుంటల్లో మలాథియన్ స్ర్పే చేయడం ద్వారా దోమల లార్వాలను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రయోగాత్మకంగా డ్రోన్లతో ఒకదశ స్ర్పేయింగ్ చేయించింది. ఫలితాలను చూసిన తర్వాత దీనిని కొనసాగించాలని అధికారులు యోచిస్తున్నారు. నగరంలో ఏటా డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రధానంగా వర్షాకాలంలో వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. నగరంలో నీరు నిల్వఉండిపోవడం వల్ల దోమలకు ఆవాసంగా మారుతోందని గుర్తించిన జీవీఎంసీ అధికారులు సమస్య పరిష్కారానికి చెరువులు, కుంటలు, డ్రైనేజీలతోపాటు నీరు నిల్వఉండే ప్రాంతాల్లో మలాథియాన్ రసాయనాన్ని పిచికారీ చేయిస్తున్నారు.
అయితే చెరువుల ఒడ్డున మాత్రమే స్ర్పే చేయడానికి అవకాశం ఉండడంతో మధ్యలో ఉండే దోమలు, లార్వాలపై ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. మనుషులతో స్ర్పేయింగ్ చేయించడం కాకుండా ఇటీవల అమరావతిలో జరిగిన డ్రోన్‌షో స్ఫూర్తిగా తీసుకున్న అధికారులు చెరువుల్లో దోమల నియంత్రణకు మలాథియాన్ స్ర్పే చేసేందుకు డ్రోన్‌లను ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందనేదానిపై దృష్టిసారించారు. రాజమండ్రిలో కూడా డ్రోన్‌తో మలాథియాన్ స్ర్పేయింగ్ చేసినట్టు తెలియడంతో, అదే ఏజెన్సీతో నగరంలోని చెరువుల్లో స్ర్పేయింగ్ చేయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.