ఆంధ్రప్రదేశ్‌లో టీసీఎస్ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ఇవాళ (సోమవారం) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు నటరాజన్ చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలియజేశారు. దివంగత రతన్ టాటా తన దార్శనిక నాయకత్వం, సహకారంతో మనదేశ పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేశారన్న చంద్రబాబు నాయుడు.. ఏపీ అభివృద్ధికి కూడా ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లేలా నటరాజన్ చంద్రశేఖరన్‌తో చర్చలు జరిగినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో టాటా గ్రూప్ కీలక భాగస్వామిగా ఉందన్న నారా చంద్రబాబు నాయుడు.. నటరాజన్ చంద్రశేఖరన్‌తో జరిగిన భేటీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చెందిన పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టాటా గ్రూప్ పరస్పర సహకారంతో ఏపీని ఎలా అభివృద్ధి చేయవచ్చనే దానిపై చర్చించినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో టీసీఎస్ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు టాటా గ్రూప్ ముందుకు వచ్చిందన్న చంద్రబాబు.. పది వేల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా టీసీఎస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఏపీలో పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి కోసం టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ రాష్ట్రవ్యాప్తంగా 20 హోటళ్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. తాజ్, వివంతా, గేట్‌వే, సెలెక్యూషన్స్, జింజర్ హోటల్స్ ఇలా 20 హోటళ్లతో పాటుగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అలాగే 40 వేల కోట్ల పెట్టుబడితో టాటా పవర్.. 5 గిగా వాట్ల సామర్థ్యంతో సోలార్, విండ్ ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతిక సహకారం కూడా టాటా గ్రూప్ నుంచి ఏపీ ప్రభుత్వం కోరుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లోనూ ఎంటర్‌ప్రెన్యూయర్‌ను తయారుచేయాలనే ఏపీ ప్రభుత్వం విజన్ అని చెప్పిన చంద్రబాబు.. ఇందుకోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కీలకంగా మారతాయని నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.