తిరుపతి జిల్లాలో ఇంట్లోనే దొంగనోట్లు తయారు చేస్తున్న ఓ కుటుంబం పోలీసులకు దొరికిపోయింది. పుత్తూరులో దొంగనోట్లు మారుస్తుండగా అడ్డంగా దొరికిపోయారు. వీళ్ల గురించి ఆరా తీస్తే కీలక విషయాలు బయటపడ్డాయి. బెంగళూరులోని యలహంకకు చెందిన రమేష్, సంధ్య ప్రేమ పెళ్లి చేసుకుని.. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి కూడలిలోని తులిప్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. సంధ్య అక్క, బావ చనిపోవడంతో వారి కుమార్తె ఇషా కూడా వీరి దగ్గరే ఉంటోంది. ఆమె బీఎస్సీ బయోకెమెస్ట్రీ పూర్తిచేసి చెన్నైలోని ఓ ప్రైవేటు మెడికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
రమేష్ ఫైనాన్స్‌లో మూడు ట్రాక్టర్లు కొనుగోలు చేసి అద్దెకు తిప్పారు.. కానీ కరోనా సమయంలో పనుల్లేకపోవడంతో పైనాన్స్ కంపెనీకి వాయిదాలు సరిగా చెల్లించలేకపోయారు. ఆ వెంటనే కంపెనీవారు ట్రాక్టర్లను తీసుకెళ్లారు. రమేష్‌కు ఫేస్‌బుక్ ద్వారా ఎనిమిదేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మునికృష్ణారావుతో పరిచయం ఉంది. ఈ ఇద్దరూ కలిసి స్టాక్ మార్కెట్ బిజినెస్ కూడా చేయగా నష్టాలు వచ్చాయి.. ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడు ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతికారు.
అప్పుడు మునికృష్ణారావు యూట్యూబ్‌లో దొంగనోట్లు ఎలా తయారు చేస్తారని గమనించాడు. వెంటనే మిత్రుడు రమేష్, అతడి భార్య సంధ్య, పెంపుడు కూతురు ఇషాకు చెప్పారు. ఈ ఐడియా ఏదో బానే ఉందనుకుని.. అందుకు అవసరమైన పరికరాలను తిరుపతిలో కొనుగోలు చేశారు. ఇంట్లోనే దొంగ నోట్లు ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. రెండు నెలల పాటూ ఈ నోట్ల తయారీలో బిజీ అయ్యారు.. ఆ తర్వాత దొంగనోట్లను మార్కెట్‌లో మార్చడం మొదలుపెట్టారు. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, నెల్లూరు, వెంకటగిరిలో ఈ నోట్లను మార్చారు.. వీరు ఏకంగా రూ.10 లక్షల వరకు దొంగనోట్లు మార్చి అప్పులు తీర్చుకున్నారు.
ఈ దొంగనోట్లు మార్చేందుకు కారును ఉపయోగిస్తున్నారు.. ఈ క్రమంలో రమేష్, ఇషాలు రెండు రోజుల క్రితం మండీవీధిలోని నిర్మల ప్రొవిజన్ స్టోర్‌లో దొంగనోట్లు మారుస్తుండగా.. ఆ షాపు యజమానికి అనుమానం వచ్చింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి వారిద్దర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అప్పుడు వీరిద్దర్ని ప్రశ్నిస్తే మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ ఇద్దరి దగ్గరున్న దొంగనోట్లు రూ.2.36 లక్షలతో పాటుతో పాటుగా ఇంకా తయారు చేసి కట్ చేయని 192 రూ.100నోట్లు, 156 రూ.500నోట్లు షీట్లను సీజ్ చేశారు. రమేష్, ఇషాలు పుత్తూరు పరిధిలో మార్చిన రూ.60వేల నగదు, కారు, యంత్రాలు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు పోలీసులు.