కేరళ రాష్ట్రం వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తెలుగు వ్యక్తులు కూడా పోటీకి దిగారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఏపీకి చెందినవారు కావడం విశేషం. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండకు చెందిన దుగ్గిరాల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. రాహుల్‌గాంధీ రాజీనామాతో వయనాడ్‌లో ఉపఎన్నిక రాగా.. ఆయన సోదరి ప్రియాంకగాంధీ ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పోటీ చేస్తున్న 16 మంది అభ్యర్థుల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆర్. రాజన్ తప్ప మిగతా వారంతా స్థానికేతరులు. అయితే వీరిలో ఇద్దరు తెలుగు వారిలో ఒకరైన డాక్టర్ నాగేశ్వరరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈయన జాతీయ జనసేన పార్టీ తరపున పోటీ చేశారు. అలాగే ఏపీకి చెందిన షేక్ జలీల్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు.
వయనాడ్ ఎంపీ స్థానానికి ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికలో పోటీలో ఉన్న 16 మంది అభ్యర్థుల్లో ఏకంగా 11 మంది రాష్ట్రేతరులు ఉండటం చర్చనీయాంశైమంది. వీరిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు. మిగిలిన అభ్యర్థుల విషయానికి వస్తే.. ప్రధాని మోదీ, వాజపేయి, మన్మోహన్ సింగ్, పీవీ నరసింహరావుతో పాటుగా ఎంతోమంది రాజకీయ నేతలపై 200కు పైగా ఎన్నికల్లో పోటీచేసిన కె.పద్మరాజన్ (తమిళనాడు) వయనాడ్‌లో పోటీలో ఉన్నారు.
అలాగే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పోటీ చేసిన జయేంద్ర కె. రాథోడ్ (గుజరాత్) వయనాడ్ బరిలో నిలిచారు. అలాగే ఉత్తరప్రదేశ్ కిసాన్ మజ్దూర్ బేరోజ్‌గార్ సంఘ్‌కు చెందిన గోపాల్ స్వరూప్ గాంధీ, తమిళనాడు బహుజన్ ద్రావిడ పార్టీ నుంచి ఎ.సీత పోటీలో ఉన్నారు. అంతేకాదు తమిళనాడుకుచెందిన నూర్ ముహమ్మద్, కర్ణాటకకు చెందిన ఇస్మాయిల్ జాబీ ఉల్లా), కర్ణాకకు చెందిన రుక్మిణి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోన్హు సింగ్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సీపీఐ నుంచి సత్యన్ మోకేరి, బీజేపీ తరఫున నవ్యా హరిదాస్ పోటీలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి ఆర్. రాజన్ ఒక్కరే వయనాడ్ నియోజకవర్గానికి చెందినవారు కావడం విశేషం.