రాబోవు రోజుల్లో భారతీయుల్లో ( ఎక్కడున్న వాళ్లైనా) గుండెపోట్లు ఎక్కువ కానున్నాయి. దీనికి చాలా కారణాలున్నాయి. అవన్నీ ఇక్కడ చెప్పేందుకు సమయం లేదు, కానీ అవి రాకుండా ఉండేందుకు కొన్ని సహజమైన పద్ధతులున్నాయి. వాటిని ఇక్కడ మీకోసం రాస్తున్నాను.
ఇవి ఐరోపా గుండె నిపుణులు ఒక పరిశోధనా పత్రంలో రాశారు.
1. కుండ తగ్గించి, కండ పెంచు.
నడక, పరిగెత్తటం వంటి వ్యాయామాల ద్వారా నడుము చుట్టుకొలత తగ్గించటం. దానికి తగ్గట్టుగా అన్ని పోషకాలున్న ఆహారం మితంగా తినడం. అలాగే బరువులు ఎత్తడం ద్వారా కండరపుష్టి సాధించటం.
2. ఎంత వండుకుంటే అంత వంటబడుతుంది.
చాలారకాలైన కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పిక్కలు, పళ్లు తినాలి. పంచదార, అలాగే దానితో తయారుచేసేవి మానెయ్యాలి. ప్రొటీన్లకోసం మొక్కలపై ఎక్కువ ఆధారపడండి (పప్పులు, పిక్కలు), అలాగే చేపలు, సముద్ర ఆహారం, ఇంకా వెన్న తీసిన పాలు. అప్పుడప్పుడూ కావాలంటే ఇతరత్రా మాంసం తినొచ్చు (కోడి, మేక) కానీ తక్కువ. ప్యాకేజీ చేసిన ఏ ఆహారం తినకపోవడమే మంచిది. తీయని పానీయాలు, శీతల పానీయాలు ముట్టకూడదు. వంటలో ఉప్పు తక్కువ వాడాలి, వాడేది ఐయోడిన్ ఉప్పు అయ్యుండాలి. ఆలివ్ నూనె మంచిది. వెన్న, కొబ్బరినూనె, పామాయిల్, డాల్డా లాంటివి పక్కనపెట్టాలి.
3. గడుసుగా తిను, గడ్డిమేయకు.
పొట్ట వెలితిగా ఉండేలా తినాలి. నింపుగా తినకూడదు. వారంలో ఒకట్రెండు రోజులు పూర్తిగా దుంపలు లేని కూరగాయలు, పప్పులు/చిక్కుళ్లు మాత్రమే తినాలి. రోజువారీ అల్పాహారం నుంచి రాత్రి భోజనం వ్యవధి పదిగంటలు ఉండాలి అంటే 14 గంటలు కడుపు ఖాళీగా ఉండాలి. చిరుతిళ్లు మానెయ్యాలి. తినేటప్పుడు తిండి మీద ధ్యాస ఉండాలి. నలుగురితో కలిసి తినడం మంచిది. పంచుకుని తినడం ఇంకా మంచిది.
4. కళ్లు తెరువు, ఒళ్లు కదిలించు.
ప్రతిరోజూ అరగంట నుంచి గంట వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి. రకరకాల వ్యాయామాలు మంచివి. కూర్చోడం తగ్గించి, అటూ ఇటూ నడుస్తూ ఉండండి. అలాగే నేస్తాలతో ఏవైనా ఆటలు ఆడండి.
5. మందెందుకురా మందబుద్ధికి తప్ప.
మందు ఇంతవరకూ ముట్టకపోతే సంతోషం ముట్టొద్దు. ఇప్పటికే ముడితే ఆపెయ్యండి.
6. పొగ ఒంటికి సెగ.
ఎటువంటి రూపంలోనూ పొగాకు దరిచేరనీయవద్దు. అది నమిలేది, పీల్చేది, కాల్చేది, ఊదేది ఎలాంటిదైనా.
7. నిద్ర భద్రం.
తొందరగా పడుకో. 7-9 గంటలు పడుకో. అరగంట ముందే అన్నీ ఆపెయ్యి- సెల్ఫోను, టీవీ, కంప్యూటరు ఇలాంటివన్నీ.
8. మనసును చెయ్యకు అలుసు.
శ్వాసనియంత్రణ, జాగరూకతగా ఉండటం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకోడానికి, తెలుసుకోడానికి ప్రయత్నించండి. అలాగే బుర్రకి పదునుపెట్టే పని ఏదైనా చెయ్యండి. జీవితాంతం మన అంతర్గతస్థితిని తెలుసుకునేలా, మన ప్రగతిని గమనించేలా జీవనశైలిని నిర్మించుకోండి. మానవ వికాసానికి సంబంధించి, ఆధ్యాత్మిక, మేధాసంబంధిత కొత్త జ్ఞానతృష్ణని అభ్యసించండి.
9. నేను, వాడు, వీడు, నేస్తం, అందరం.
కుటుంబసభ్యులతోనూ, స్నేహితులతోనూ అవినాభాహవ సంబంధాలు బలపరచండి. వారితో స్నేహపూర్వక శైలిలో మాట్లాడండి. క్షమాగుణాన్ని కలిగి ఉండండి. ప్రతిరోజూ ఇతరులయందు దయని కలిగి ఉండండి. అలాగే పరోపకారానికి వెనుకంజ వేయొద్దు.
10. ప్రకృతితో మమేకం.
శబ్ద, వాయు, నీటి కాలుష్యానికి దూరంగా ఉండండి. వీలైనంత ప్రకృతితో గడపండి. ఉద్యానవనాల్లో, తోటల్లో వ్యాయామం గుండెకి మనసుకీ రెంటికీ మంచిది.