భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడవ మ్యాచ్‌కు తెరలేచింది. నేడు సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. ఆతిథ్య సఫారీ జట్టు కెప్టెన్ మార్క్రమ్ టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ అవేశ్ ఖాన్ స్థానంలో మరో పేసర్ రమణ్‌దీప్ సింగ్‌కు అరంగేట్ర అవకాశం ఇచ్చింది.టాస్ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ... తాము తొలుత బ్యాటింగ్ చేసిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ బాగానే ఆడామని గుర్తుచేశాడు. కుర్రాళ్లు స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగి, టీమ్ ప్లాన్ ను ఆచరిస్తున్నారని, ఈ విషయంలో సంతోషంగా ఉన్నానని అన్నాడు. యువ ఆటగాళ్లు వారి ప్రదర్శనతో తన పనిని సులభం చేస్తున్నారని మెచ్చుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఒక మార్పు చేశామని, అవేశ్ ఖాన్ స్థానంలో రమణ్‌దీప్ సింగ్‌ని తుది జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు. అవేశ్ ఖాన్ బాగానే రాణించినప్పటికీ జట్టులో ఒక స్థానం కోసం త్యాగం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు