జైలులో ఖైదీలకు పోలీస్ శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పిస్తామని ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిశోర్ హామీ ఇచ్చారు. జిల్లా జైలులో భద్రతా చర్యలను ఎస్పీ కిశోర్ మంగళవారం పరిశీలించారు. భద్రతపై సమీక్షించారు. జైలులో రిమాండ్ ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ ఖైదీలు సత్‌ప్రవర్తనతో మెలగాలని, నేరాలు చేసి జైలులో ఉంటే దాని ప్రభావం కుటుంబంపై పడుతుందన్నారు. పిల్లలను మంచి పద్ధతిలో పెంచి చదువు నేర్పించాలన్నారు.
అనంతరం అధికారులతో మాట్లా డుతూ సీసీటీవీ పుటేజ్ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లా జైలులో సెంట్రీ టవర్‌ను నిర్మించాలని ఎస్పీ సూచించారు. జైలు గోడ చుట్టూ ఎలక్ర్టికల్ లైవ్ లైన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. జైలు సూపరింటెండెంట్ సీహెచ్ ఆర్‌వి.స్వామి, ఏఆర్ డీఎస్పీ శ్రీహరి, జైలర్లు కె వెంకటరెడ్డి, కె.శ్రీనివాసరావు, డిప్యూటీ జైలర్ కిశోర్‌కుమార్, కె.సత్యనారాయణ, డాక్టర్ జి స్వరూప్, జైలు సిబ్బంది పాల్గొన్నారు.