కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, సీబీఐ విచారణ జరిపించాలని గతంలో డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అయిందని... కానీ మేఘా కృష్ణారెడ్డి ఇప్పుడు సీఎంకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడని ఆరోపించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ద్వంద్వ విధానాలను పాటిస్తుందని విమర్శించారు.కాళేశ్వరం అవినీతిపై కాగ్ నివేదిక తేటతెల్లం చేసిందని, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటేనే సత్వర న్యాయం జరుగుతుందని, కోర్టు విచారణలతో ఏళ్లు పడుతుందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను తాను కోర్టు ద్వారా నిలువరించానన్నారు. అవినీతి, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాను న్యాయ పోరాటం చేస్తున్నానన్నారు. ప్రజలు తన పోరాటానికి మద్దతు పలకాలన్నారు.అదానీ, అంబానీలను బిలియనీర్లుగా చేసింది కాంగ్రెస్సే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీలను బిలియనీర్లుగా చేసిందే కాంగ్రెస్ పార్టీ అని కేఏ పాల్ విమర్శించారు. ఇప్పుడు అదే అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ విధానాలకు నిదర్శనమన్నారు.