తిరుమలను పక్కా ప్రణాళిక తో మోడల్ టౌన్ గా తీర్చిదిద్దే దిశగా పనులు జరుగుతున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని తిరుపతిలోని పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్‌లో తిరుమలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించినున్నట్లు సూచించారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరం అని, టీటీడీకి అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్‌ను కూడా కొత్తగా నిర్మాణం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.రాబోయే 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డాక్యుమెంట్ను రూపొందించి దాని ప్రకారం మౌళిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందన్నారు. ఇందుకు టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ను సలహాదారుగా నియమించినట్లు వివరించారు.