రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమతుల్యం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుచెప్పారు. దేనికైనా ఓ విజన్ ఉండాలని, ఆ విజన్‌కు కావాల్సిన పునాదిని పటిష్టంగా వేసుకుంటే అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. శుక్రవారం శాసనసభలో విజన్-2047 డాక్యుమెంట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల ఆదాయం, ఆరోగ్యం, సంతోషం ముఖ్యమన్నారు. పేదరిక నిర్మూలనే ప్రధాన అజెండాగా పది కీలక సూత్రాలతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆ డాక్యుమెంట్‌లోని అంశాలు, రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో పాటు గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాలను వివరిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘‘చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని తప్పులు చేశారు. వ్యవస్థలు పూర్తిగా విధ్వంసం అయ్యాయి.
అధికార యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. అప్పులు పరాకాష్టకు చేరాయి. నిత్యం తప్పుడు ప్రచారాలు చేసే పరిస్థితికి వచ్చారు. అసత్యాలను పదేపదే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి 45 ఏళ్ల రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు. కూటమికి స్పష్టమైన మెజార్టీ ఇచ్చి ప్రజలు గెలిచారు. ఇక రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత గెలిచిన అభ్యర్థులపై ఉంది. విజన్ డాక్యుమెంట్లపై కొత్తగా కసరత్తు చేయడంలేదు. దేశంలోనే తొలిసారిగా.. 1999లోనే విజన్-2020 ప్రకటించాం. స్వర్ణాంధ్ర-2047కు సరైన పునాది వేసుకోగలిగితే ఎవరు వచ్చినా ముందుకు వెళ్తారు. మళ్లీ దుర్మార్గుడైన జగన్ వస్తే ఏం జరుగుతుందో చెప్పలేం అని అన్నారు.