కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ప్రియాంక గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. వయనాడ్‌లో ప్రియాంక 4 లక్షల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. ఈ గెలుపు అనంతరం ఖర్గేను కలిశారు. ఇరువురు పరస్పరం మిఠాయి తినిపించుకున్నారు. అనంతరం ప్రియాంకకు ఖర్గే శాలువా కప్పి అభినందించారు. ఓ చిన్నారితో ప్రియాంకకు పుష్పగుచ్ఛం ఇప్పించారు.పార్లమెంట్‌లో ప్రియాంక గాంధీ వయనాడ్, దేశం తరఫున గళమెత్తుతారని ఖర్గే పేర్కొన్నారు. ఆమె చురుకైన నాయకత్వం, కరుణ, దయ, సంకల్పం, నిబద్ధత ప్రజాస్వామ్యానికి మరింత దోహదపడతాయన్నారు. వయనాడ్‌లో తమను ఎన్నుకున్నందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞత తెలిపారు.మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఊహించలేదని ఖర్గే అన్నారు. ఈ ఓటమికి గల కారణాలపై అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఛత్రపతి శివాజీ, అంబేడ్కర్ సిద్ధాంతాలకు తాము నిజమైన ప్రతినిధులం అన్నారు. తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఝార్ఖండ్ ప్రజలు తమ హక్కులు, నీరు, అడవులు, భూసమస్యలకు ప్రాధాన్యం ఇచ్చారని, అందుకే తమ కూటమికి విజయాన్ని అందించారన్నారు. తప్పుడు రాజకీయాలను తిప్పికొట్టారన్నారు.