నేటి రోజుల్లో ప్రతి పనీ డిజిటల్ రూపం మార్చుకుంది. తినే తిండి నుంచి మొదలుకుని బ్యాంకు లావాదేవీల వరకూ ప్రతీ పని ఆన్‌లైన్ అయ్యింది. అయితే గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొంతమందితో పాటుగా నిరక్ష్యరాస్యులు.. ఈ దిశగా ఇంకా అప్‌డేట్ కాలేదు. ఆ తెలియనితనాన్నే్ కొంతమంది ఘరానా మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వినియోగదారులకు సులభతర బ్యాంకింగ్ సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో అన్ని బ్యాంకులు ఇప్పుడు ఏటీఎం కార్డులు ఇస్తున్నాయి. కార్డుల ద్వారా డబ్బు డిపాజిట్, విత్ డ్రాలకు బ్యాంకు వరకూ రానవసరం లేకుండా.. వినియోగదారుల కోసం ఈ కార్డులు జారీ చేస్తున్నాయి. అలాగే ఆన్‌లైన్ లావాదేవీలకు అనుగుణంగా ఏటీఎం కార్డులు జారీ చేస్తు్న్నాయి. అయితే ఈ కార్డులను ఎలా వాడాలో తెలియని కొంతమంది ఏటీఎం కేంద్రాల వద్ద పక్కనున్న వ్యక్తులను సాయం కోరి.. కొంతమంది చేతుల్లో మోసపోతున్నారు. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ కేటుగాడు కార్డు మార్చి ఓ వ్యక్తిని బురిడి కొట్టించిన ఘటన చోటుచేసుకుంది. ఉరవకొండలోని కెనరా బ్యాంక్ ఏటీఎం వద్దకు ఓ వ్యక్తి డబ్బులు తీయడానికి వచ్చాడు. అయితే ఏటీఎం కార్డును ఉపయోగించి ఏటీఎం నుంచి ఎలా డబ్బు తీయాలనే దానిపై అతనికి అవగాహన లేదు. దీంతో పక్కనున్న ఓ వ్కక్తి సాయం కోరాడు. దీంతో అతనికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ బురిడీ కొట్టించిన కేటుగాడు.. అతని కళ్లముందే కార్డు మార్చేశాడు. ఆ తర్వాత కొట్టేసిన కార్డుతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తర్వాత పలుచోట్ల ఈ కార్డును ఉపయోగించి.. బాధితుడి అకౌంట్ నుంచి రూ.75 వేల నగదు డ్రా చేశాడు.
అయితే మోసపోయిన విషయం ఆ తర్వాత గ్రహించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎం సెంటర్ వద్దకు చేరుకుని.. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మోసగాణ్ని్ గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఏటీఎం కేంద్రాల వద్దకు డబ్బులు డ్రా చేయడానికి వెళ్లినప్పుడు.. అక్కడున్న సెక్యూరిటీ సహాయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదా బ్యాంకులకు అనుబంధంగా ఉన్న ఏటీఎం సెంటర్ల వద్ద సిబ్బంది సహకారంతో డబ్బులు డ్రా చేయాలని కోరుతున్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచితులకు బ్యాంకు ఏటీఎం కార్డులు, పాస్‌వర్డ్ వంటి విషయాలు పంచుకోవద్దని సూచిస్తున్నారు.