శబరిమల అయ్యప్ప దర్శనం కోసం తరలివెళ్తున్న భక్తుల సంఖ్య పెరిగింది. అయ్యప్పకు ప్రీతికరమైన కార్తీకమాసం కావటంతో ఈ నెలలో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. అలాగే సంక్రాంతి సందర్భంగా మకరజ్యోతి దర్శనం కోసం మరింత మంది భక్తులు తరలివెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా భారతీయ రైల్వే శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 62 ప్రత్యేక రైళ్లు నడపనుంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 27 వరకూ ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కొల్లాంకు 44 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతోంది. 08539 నంబరుతో విశాఖపట్నం - కొల్లాం ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు డిసెంబర్ 4వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 వరకూ అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నం- కొల్లాం ప్రత్యేక రైలు డిసెంబర్ నాలుగు నుంచి ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నంలో ఉదయం 8.20 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇక గురువారం కొల్లాం నుంచి విశాఖపట్నం (08540) తిరిగి బయల్దేరుతుంది. డిసెంబర్ ఐదు నుంచి ఫిబ్రవరి 27 వరకూ ప్రతి గురువారం కొల్లాం- విశాఖపట్నం ప్రత్యేక రైలు (08540) అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కొల్లాం నుంచి ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
అలాగే శ్రీకాకుళం- కొల్లాం మధ్య 18 ప్రత్యేక రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. 08553 నంబరుతో డిసెంబర్ ఒకటి నుంచి జనవరి 27 వరకూ శ్రీకాకుళం- కొల్లాం ప్రత్యేక రైలు (08553) నడపనున్నారు. ఈ రైలు ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళంలో బయల్దేరి మంగళవారం మధ్యాహ్నం 2.30కు కొల్లాం చేరుకోనుంది. మంగళవారం సాయంత్రం నాలుగున్నరకు కొల్లాంలో తిరిగి బయల్దేరనున్న కొల్లాం - శ్రీకాకుళం ప్రత్యేక రైలు (08554) రైలు.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు శ్రీకాకుళం వస్తుంది.
మరోవైపు కాచిగూడ- కొట్టాయం మధ్యన కూడా అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. డిసెంబర్ 5 నుంచి 27 వరకు ప్రతి గురువారాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. 07133 నంబరుతో ప్రతి గురువారం కాచిగూడ - కొట్టాయం ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు ప్రతి గురువారం మధ్యాహ్నం మూడు గంటల 40 నిమిషాలకు కాచిగూడలో బయల్దేరి.. మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల 50 నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది. అనంతరం 07134 నంబరుతో కొట్టాయం నుంచి శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు బయల్దేరి.. శనివారం రాత్రి 11.40 గంటలకు కాచిగూడ వస్తుంది.
అలాగే 07135 నంబరుతో హైదరాబాద్ - కొట్టాయం ప్రత్యేక రైలును డిసెంబర్ మూడు నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ నడపనున్నారు. ఈ రైలు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు కొట్టాయం చేరుకోనుంది. 07136 నంబరుతో కొట్టాయం నుంచి బుధవారం సాయంత్రం 6.10 గంటలకు తిరిగి బయల్దేరి.. గురువారం రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్ వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు,