5జీ ఇంటర్నెట్ వినియోగంతో ఇప్పటికే శరవేగంగా పరుగులు తీస్తున్న ప్రపంచం.. తదుపరి తరం వైర్‌లెస్ 6జీ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. కానీ, 6జీ టెక్నాలజీకి ప్రపంచం చేరువవుతున్న కొద్దీ సరికొత్త ఆందోళన తెరపైకి వస్తున్నది.
టెరాహెట్జ్ రేడియో ధార్మికత వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి. టెరాహెట్జ్ తరంగాలు 6జీ సాంకేతికతకు వెన్నెముక లాంటివి. వీటి నుంచి ఓ రకమైన విద్యుదయస్కాంత రేడియో ధార్మికత వెలువడుతుంది.
ఈ తరంగాల వల్ల ఎన్నో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి. టెరాహెట్జ్ తరంగాలతో మానవాళి ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నదని, ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉన్నదని ఇటీవల చైనా సైనిక శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. పురుషుల సంతానోత్పత్తి శక్తిపై తీవ్రంగా ప్రభావం చూపగలదని నిర్ధారణ అయ్యింది.