నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై ఏర్పడిన వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలినట్టు ఐఎండి గుర్తించింది.ప్రస్తుతానికి నైరుతి బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ట్రింకోమలీకి దక్షిణ ఆగ్నేయంగా 340 కిమీ, నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 630 కిమీ, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 750 కిమీ మరియు చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 830 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.వాయుగుండం రానున్న 12 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజుల్లో ఉత్తర-వాయువ్య దిశగా శ్రీలంక - తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగనుంది.దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో నవంబర్ 26 నుండి 29 వరకు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 29వ తేది వరకు దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాయుగుండం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. దక్షిణకోస్తా తీరం వెంబడి మంగళవారం రాత్రికి గంటకు 50-70కిమీ, బుధవారం నుంచి 55 -75కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.