సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలకు పాలించే హక్కు లేదని కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ ఐక్యవేదిక, వ్యవసాయ, కార్మిక, వృత్తి సామాజిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఆందోళనకు ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జె.జయంతిబాబు, రైతు కూలీసంఘం జిల్లా సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.నాంచార్లు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా సంయుక్త మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ ఆరేళ్ల క్రితం కేంద్రప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ ప్రభుత్వ మొండివైఖరి కారణంగానే దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఏటా రూ.3లక్షల కోట్ల మేర నష్టపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.