వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. దూరప్రాంతాలకు అత్యంత వేగంగా చేరుకునేలా రైలు ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే తీసుకొచ్చిన ట్రైన్. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. సుమారుగా అన్నిచోట్లా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సాధారణ రైళ్లతో పోలిస్తే అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉండటం, సుదూర ప్రాంతాలను వేగంగా చేరుకునే సౌలభ్యం వందే భారత్ రైళ్లకు మంచి డిమాండ్ తీసుకువస్తోంది. అందుకే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల కంటే టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లవైపు రైలు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఏర్పాటు చేయాలంటూ పలుచోట్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి తేవాలంటూ టీడీపీ ఎంపీ, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ కోరుతున్నారు. ఇదే విషయమై విశాఖ ఎంపీ శ్రీభరత్.. రైల్వేశాఖ మంత్ర అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. అశ్వినీ వైష్ణవ్‌ను బుధవారం కలిసిన ఎంపీ శ్రీభరత్.. విశాఖపట్నం- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణంపై ముందడుగు వేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీభరత్.. వాల్తేరు డివిజన్‌ను అలాగే కొనసాగించాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. అలాగే విశాఖపట్నం బెంగళూరు మధ్య ప్రతి రోజూ రైలు నడపాలని కోరిన ఎంపీ శ్రీభరత్.. విశాఖ తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సైతం మంజూరు చేయాలని కోరారు.
అలాగే విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు దువ్వాడలో స్టాపింగ్ ఇవ్వాలని అశ్విని వైష్ణవ్‌ను విశాఖ ఎంపీ శ్రీభరత్ కోరారు. విశాఖపట్నం ఆర్థిక అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యం, ఇతర ప్రాంతాలతో అనుసంధానం విషయాలను దృష్టిలో పెట్టుకుని వీటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. శ్రీభరత్ వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మరోవైపు విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా నడుస్తోంది. అయితే ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి శ్రీవారి భక్తులు ఎక్కువగా వెళ్తుంటారని..వారిని దృష్టిలో పెట్టుకుని విశాఖ తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి తేవాలనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.